2026లో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఒకటి. పోస్టర్స్, గ్లింప్స్ అంటూ కొన్ని నెలలుగా సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాకింగ్ స్టార్ యశ్ బర్త్ డే సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్ రాయ’ అంటూ తన పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంత సంచలనమయ్యిందో అందరికీ తెలిసిందే. కియారా అద్వానీ నాడియాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, నయనతార గంగగా, తారా సుతారియా రెబెక్కాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా అద్భుతమైన పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం రోజున టాక్సిక్ మూవీ టీజర్ విడుదలై అభిమానులను అలరిస్తోంది. టాక్సిక్ టీజర్‌ను కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. టాక్సిక్ టీజర్‌ను గమనిస్తే.. ఒక విస్తృతమైన, గొప్పదైన సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. ఇది ఒక వైపు చూడటానికి రంగుల ప్రపంచంలా కనిపిస్తూనే, హింసాత్మకమైన స్వరూపాన్ని కూడా ప్రదర్శిస్తుంది. సర్కస్ వాతావరణం, తూర్పు ఆసియా శైలిని గుర్తు చేసే నేపథ్యాల వరకు వివిధ కాలాల్లో కథ ప్రయాణిస్తున్నట్లు టీజర్‌ను రూపొందించారు. మొత్తం మీద ఒక డార్క్, కాస్త రఫ్ టోన్‌తో టీజర్ కనిపిస్తుంది. టీజర్‌లో చూపించిన బలమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాల వెనుక ఒక లోతైన భావం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. కథ చెప్పే విధానంపై ప్రత్యేక శ్రద్ధ, నటీనటుల శక్తివంతమైన ప్రదర్శన..ఇవన్నీ ఈ ప్రపంచానికి ఎంతో కీలకమని టీజర్ సూచిస్తోంది. ఈ టీజర్లో సినిమాటిక్ తుపాన్ కలకలానికి కేంద్రబిందువుగా రాకింగ్ స్టార్ యశ్ కనిపిస్తున్నారు. ఆయనలో కనిపిస్తున్న మార్పు కేవలం లుక్ మార్చడం మాత్రమే కాదు..పూర్తిగా కొత్త అవతారంలోకి మారినట్టుగా తెలుస్తోంది. సన్నగా, వేగంగా కదిలే శరీరాకృతినుంచి యుద్ధాలకు సిద్ధమైన బలమైన, దృఢమైన ఆకారానికి మారడం వరకు ఆయన చూపించిన శరీరాకృతిలోని మార్పు ఈ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలుస్తోంది. ఈ మార్పు ఆయనెంతోపట్టుదలతో నిరంతర కృషితో కఠిన సాధన చేసిన ఫలితంగా తెలుస్తోంది.










