మూవీ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీ అవుతోంది. ఇండస్ట్రీని వెంటాడుతోన్న పైరసీ భూతానికి చెక్ పెట్టారంటూ తెలంగాణ పోలీసులను టాలీవుడ్ టాప్ హీరోస్ చిరంజీవి, నాగార్జున ప్రశంసించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో తాజాగా భేటీ అయిన సినీ ప్రముఖులు… ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తన ఫ్యామిలీలోనూ డిజిటల్ అరెస్ట్ జరిగినట్లు నాగ్ తెలిపారు. తన కుటుంబంలో ఒకరిని దాదాపు 2 రోజుల పాటు నిర్భందించారని… పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారన్నారు.
పైరసీ వెబ్ సైట్స్ ఓ బిగ్ ట్రాప్ అని ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దని సూచించారు. ‘తెలంగాణ పోలీసులకు నా అభినందనలు.ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత చెన్నై నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి తాము అక్కడ చేయలేనిది ఇక్కడ మనం చేశామన్నాడు. కేవలం రూ.20 కోట్ల కోసమే ఇది కాదు. పైరసీ వెనుక అంతర్జాతీయ ముఠా ఉంది.50 లక్షల మంది సబ్‌స్రైబర్ల డేటా వారికి చేరింది. ఫ్రీగా సినిమాలు చూపించాలనేదే వారి ఉద్దేశం కాదు.
దీనిలో రూ.వేల కోట్లు దోచుకునే ప్లాన్ ఉంది. పైరసీ వల్ల ప్రతీ ఏటా ఇండస్ట్రీకి కోట్లలో నష్టం వస్తోంది. సినిమాలు ఫ్రీగా చూపిస్తున్నారని అనుకోవద్దు. దాని వెనుక ఉన్న బిగ్ స్కామ్ అందరూ గమనించాలి.’ అని అన్నారు.లైట్ బాయ్ దగ్గర నుంచీ స్టార్ హీరోస్, డైరెక్టర్ల వరకూ ఇండస్ట్రీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ఎంతోమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవడం… తిరిగి పోలీసులకే సవాల్ చేయడాన్ని తట్టుకోలేకపోయాం.
ఇలాంటి టైంలో గత సీపీ సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ చాలా శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు.ఈ కేసులో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాను ప్రజలు కూడా తమదిగా భావించాలి. పైరసీ మూవీస్ చూడొద్దు. థియేటర్లలోనే చూడాలి. ఈ ఏడాది ఎన్నో సినిమాలు పైరసీ చేయగా… ఎంతో నష్టం జరిగింది. త్వరలో రాజమౌళి గొప్ప మూవీ తీయనున్నారు. అప్పుడు మన ఖ్యాతి ఖండాంతరాలు విస్తరిస్తుంది. ఆ టైంలోనూ పైరసీ పెను సవాలుగా ఉంటుంది. ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నా.’ అని చెప్పారు.
ఇది సూపర్ హిట్ సీన్
ఐ బొమ్మ రవి అరెస్ట్ సినిమాలో సూపర్ హిట్ సీన్‌లా ఉందని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. ‘విలన్ ఛాలెంజ్ చేస్తే 2 నెలల తర్వాత హీరో అతన్ని కటకటాల వెనక వేసినట్లు ఉంది. పోలీసులతో ఆటలొద్దు. భస్మాసురుడి హస్తంలా తన తలమీద తనే చేయి పెట్టుకున్నాడు. ఏదీ ఫ్రీగా రాదు. అలా వస్తే దాని వెనుక పెద్ద ప్రమాదం ఉంటుంది. పైరసీ చేసే వాళ్లు సంఘ సేవ చేయడం లేదు. పెద్ద పెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారు. మీ పర్సనల్ డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారు. పైరసీ వెబ్ సైట్లలో సినిమాలు ఉచితంగా చూసి ఇబ్బందుల్లో పడకండి.’ అని అన్నారు.
చాలెంజ్ చేశాడు పోలీసుల పవర్ చూపించాడు
సినిమా పైరసీ కేసులో కీలక నిందితుడు, ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకే సవాలు విసిరిన రవిని పట్టుకోవడంపై హైదరాబాద్ పోలీసులను, సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ ప్రశంసించారు. విదేశాల నుంచి సినిమా కాపీలను దొంగిలించి, కోట్లాది నష్టం కలిగించిన ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేయటంపై అభినందనలు తెలిపారు.పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన హై-లెవల్ హెచ్‌డీ మూవీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు. ఐ బొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాధించిన విజయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి, నగర పోలీస్ మాజీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసించారు.
పోలీసులకే బహిరంగ సవాలు విసిరిన నిందితుడిని ఎట్టకేలకు పట్టుకోవడంపై ఆయన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.దమ్ముంటే పట్టుకోండి నన్ను’ అని పోలీసులను సవాల్ చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత నేతృత్వంలోని హైదరాబాద్ పోలీస్ బృందం అరెస్ట్ చేయడం అభినందనీయమన్నారు. డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, సినిమా విడుదల కంటే ముందే ఒరిజినల్ హెచ్‌డీ కాపీలను వెబ్‌సైట్లలో విడుదల చేసి, సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన ఈ హై-లెవల్ పైరసీ కేసు వివరాలను గతంలో తాను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు.’సైబర్ క్రైమ్ బృందం జూన్ 5 నుంచి రాత్రింబవళ్లు శ్రమించి విదేశాల్లో ఉన్న ఈ రవి మినహా మిగిలిన ముఖ్య నిందితులందరినీ అరెస్ట్ చేసింది. తాజాగా రవిని కూడా అరెస్టు చేశారు.
పోలీసులకే సవాల్ విసిరిన రవిని అరెస్టు చేసినందుకు.. అద్భుతమైన పనితీరు కనబరిచిన డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్, సిటీ పోలీస్, కమిషనర్ సజ్జనార్‌లకు నా శుభాకాంక్షలు’ అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.నిందితుడు ఇమ్మడి రవి సినిమా విడుదల కాకముందే డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, ఒరిజినల్ హెచ్‌డీ కాపీలను తమ ఐ బొమ్మ వెబ్‌సైట్ల విడుదల చేయడం ద్వారా సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించాడు. ఈ పైరసీ ముఠా కార్యకలాపాలను గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూన్ 5వ తేదీ నుంచే లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ హ్యాకర్లు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల (CDN) సర్వర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.
కొత్త సినిమా ప్రివ్యూలు లేదా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఫైళ్లను తస్కరించి, కొన్ని గంటల్లోనే హెచ్‌డీ నాణ్యతతో ఆన్‌లైన్‌లో ఉంచేవారు. కరీబియన్ దీవుల నుంచి ఈ ఫైరసీలు చేసేవాడు.విదేశాల్లో ఉంటూనే పోలీసుల దర్యాప్తును చూసి, రవి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. ‘నన్ను పట్టుకునే దమ్ము మీకు లేదు’ అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు, డీసీపీ కవిత బృందం అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతడి లొకేషన్, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పూర్తి సమాచారాన్ని సేకరించింది. చివరగా.. రవితో విభేదాల కారణంగా భార్య దూరంగా ఉంటుండగా ఆమె ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఐ బొమ్మ, బొప్పమ్ టీవీ వెబ్‌సైట్లను బ్లాక్ చేశారు.
ఇమ్మడి రవి హార్డ్ డిస్క్ లో 21 వేల సినిమాలు పెట్టాడు: సీపీ సజ్జనార్
ఐబొమ్మ కేసు నిందితుడు ఇమ్మడి రవి తన హార్డ్ డిస్క్ లో 21 సినిమాలు పెట్టాడని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి సి సజ్జనార్ వెల్లడించారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయి. ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూ.20 కోట్లు సంపాదించాడు.. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశామన్నారు. 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉందని అయన అన్నారు.











