జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ దశరథ మాధవ్ మాట్లాడుతూ – మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఆకట్టుకునేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో నేను బ్రదర్ రోల్ లో నటించాను. చిన్న సినిమా అయినా “కిల్లర్” పెద్ద విజయం సాధిస్తుంది. అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – నేను సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. నేను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్ లో పర్ ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం “కిల్లర్” చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఈ మూవీ కోసం డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడ్డాడు. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్ కు వెళ్తారు. కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించినవారం అవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పర్ ఫార్మర్ అని, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. పూర్వాజ్ లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు అన్నారు.











