థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ‘గాంధీ టాక్స్’ ఇప్పుడు మార్చి 6 నుండి జీ5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులోకి రానుంది. మూవీమిల్, క్యోరియస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ టాక్స్’లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘గాంధీ టాక్స్’ అనేది వ్యక్తిగత నష్టం, ఆర్థిక ఒడిదుడుకులు, నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్న కొందరి వ్యక్తుల ప్రయాణం. వారి మార్గాలు, ప్రయాణాలు ఎలా కలిశాయి.. ఆ తరువాత కలిగిన పర్యవసానాలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ సాగుతుంది. ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా నటీనటుల పర్ఫామెన్స్, విజువల్స్, మ్యూజిక్‌తోనే కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులకు లోతుగా లీనమయ్యే, కనెక్ట్ చేసేలా ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ‘గాంధీ టాక్స్’ ఇస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘‘గాంధీ టాక్స్’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నో విషయాల్ని ఈ మూవీ కమ్యూనికేట్ చేస్తుంది. మన పర్ఫామెన్స్, ప్రజెన్స్‌తో పూర్తిగా భావోద్వేగాలను వ్యక్తపరచడం ఒక ప్రత్యేకమైన అనుభవం. థియేటర్‌లో మాకు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు జీ5 ద్వారా అందరి ఇళ్లలోకి రాబోతోంది. ప్రేక్షకులు మా ‘గాంధీ టాక్స్’తో, అందులోని సందేశంతో కనెక్ట్ అవుతారని, ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.











