‘కోర్ట్’తో బ్లాక్ బస్టర్ పెయిర్‌గా నిలిచిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, సెన్సేషనల్ డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో.. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ ఈవెంట్‌కి పెద్దలందరూ ఎన్నో ఆశీస్సులు ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ‘స్వాగ్’ మూవీలో రోషన్ నా కొడుకుగా చేశాడు. టాలెంట్ ఉన్న రోషన్ పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పా. ఈ మూడేళ్లలోనే ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘కోర్ట్’లో శ్రీదేవీ చక్కగా నటించారు. ఈ కాకినాడ అమ్మాయికి మరిన్ని మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్ సతీష్‌కి ఆల్ ది బెస్ట్. ‘బ్యాండ్ మేళం’ క్లైమాక్స్ గురించి అందరూ చెబుతున్నారు. ఈ మూవీని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోన గారికి సినిమా అంటే ప్రాణం, పిచ్చి. ఆయనకు సినిమాలే ప్రాణం. ఆయనలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఆయన ఇంకా ఇలాంటి మంచి చిత్రాల్ని తీస్తూ, ఎంతో మంది కొత్త ఆర్టిస్టుల్ని, దర్శకుల్ని పరిచయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.










