‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా కాగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చిత్ర బృందం, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు. చాలా రోజుల తరువాత మిమ్మల్ని ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈ ఉగాది ‘ఉస్తాద్ ఉగాది’ కాబోతుంది. ఒక బిగ్ స్టార్ నుంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలమైందని నా అభిప్రాయం. అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా స్టార్ హీరో నుంచి అన్ని హంగులతో వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదని నా ఫీలింగ్. పాటలు, డ్యాన్స్, డైలాగులు, ప్రేమ, హాస్యం, విలన్ తో పవర్ ఫుల్ సీన్స్.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందని నేను చెప్పలేని కానీ, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి సినిమా వచ్చి కాలమైంది, ఇంత ఎంటర్‌టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని అనుకుంటారు. హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్స్, డైలాగ్ లు, హాస్యం వరకు ఇలా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండి.. పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూశామనే సంతృప్తిని ఇస్తుంది ఉస్తాద్. అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చాము. పక్కా ప్లానింగ్ తో సమయాన్ని, డబ్బుని వృధా చేయకుండా ఈ సినిమా పూర్తి చేయగలిగాము. అలా చేయగలగడానికి మా ప్రధాన బలం పవన్ కళ్యాణ్ గారు. ప్రజా పాలన, పరిపాలనా పరమైన అంశాలకు ఇబ్బంది కలగకుండా మాకు సమయం ఇచ్చేవాళ్ళు. ఫలానా సమయానికి రాగలనని, ఇంత సమయం కేటాయించగలనని ముందుగానే సమాచారం ఇచ్చేవారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఆలస్యమైనా ఒక్కసారి కూడా అసహనం ప్రదర్శించలేదు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే చివరి నిమిషంలో హీరోలా వచ్చి, నేపథ్య సంగీతం బాధ్యత తీసుకున్న తమన్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి కేవలం 12-13 రోజుల్లో అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇలాంటి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ సినిమా చూసి కాలమైందని చూసిన ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి చెబుతారు. అభిమానులు మళ్ళీ మళ్ళీ చూస్తారు” అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. అది ఉస్తాద్ భగత్ సింగ్ తో నెరవేరింది. ఐదారేళ్ళ క్రితం సినిమా చేయాలనుకున్నాము. కోవిడ్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం వంటి కారణాల వల్ల.. గతేడాది జూన్ లో సినిమా ప్రారంభించాము. నిర్మాతలుగా మాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఒక పిక్నిక్ లాగా సినిమా అయిపోయింది అన్నారు.











