ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్‌లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ రాజ్, జి.ఎం. సుందర్, జార్జ్ మారియన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత కన్నన్ రవి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఇంట్రో వీడియోకు మంచి స్పందన వచ్చింది. చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌లో అధికారికంగా సినిమా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నామ్ తమిళర్ కచ్చి చీఫ్ కోఆర్డినేటర్ సీమన్, లతా రజినీకాంత్, ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి, దర్శకుడు బాలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత కన్నన్ రవి మాట్లాడుతూ.. “ఇలాంటి వేదికపై మాట్లాడటం ఆనందంగా వుంది. సినిమా రంగంలో నేను ఇంకా చిన్న చిన్న అడుగులు వేస్తున్నవాడినే. వ్యాపార రంగంలో ధైర్యంగా మాట్లాడగలిగినా, సినిమాల విషయానికి వస్తే నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థినే. తమిళనాడుకు చెందిన సూపర్ స్టార్ కుటుంబంతో కలిసి పని చేసే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఐశ్వర్యా రజినీకాంత్ ఎంతో ప్రతిభావంతమైన దర్శకురాలు. ఆమె ప్రతిభతో పాటు ఆమె వినయం కూడా నన్నెంతో ఆకట్టుకుంది. సురాజ్ వెంజరమూడుతో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము గతంలో కొన్ని ప్రాజెక్టులు చేయాలని అనుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో కలిసివస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఆరంభం అని నమ్ముతున్నాను”. దర్శకురాలు ఐశ్వర్యా రజినీకాంత్ మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా చిత్ర ప్రయాణానికి ఇది మంచి ప్రారంభం. నాపై, నా టీంపై నమ్మకం ఉంచిన నిర్మాత కన్నన్ రవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి మేమంతా పూర్తి నిబద్ధతతో పని చేస్తాము” అన్నారు.










