తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి చేయబోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శనివారం రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వెర్సటైల్ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్. ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండగా..ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలు. భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రెండు సంస్థలకు ఎంతో ప్రత్యేకమైనది. ఘనంగా జరిగిన కార్యక్రమంలో సురేఖ కొణిదెలతో పాటుగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, స్వప్నాదత్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.











