శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత – నటులు మురళీ మోహన్ రిలీజ్ చేశారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మురళీ మోహన్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు దాసరి చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు, శంకర్ రావుతో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. గతంలో తెలుగు సినిమా అంటే తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం సంతోషంగా ఉంది అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ”మాకు సినిమా ఇండస్ట్రీతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలు చేయాలంటే డబ్బులు కావాలని రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాం. అప్పుడే మురళీమోహన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశారు. రియల్ ఎస్టేట్ లో సంపాదనతో చిన్న బడ్జెట్ లో సినిమాలు చేద్దామని ముందుకొచ్చాం. మా సంస్థలో “అమరావతికి ఆహ్వానంష ఆరవ సినిమా. మేము నిర్మించిన గత చిత్రాలన్నీ థియేట్రికల్ గానే రిలీజ్ చేశాం. భోజ్ పూరిలో ఒక సినిమా చేసి అక్కడ విడుదల చేశాం. హారర్ జానర్ లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం” అన్నారు.











