ట్రూ పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు దాని ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో నెక్స్‌ట్ చాప్టర్. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది, దీనిని టి-సిరీస్ సమర్పిస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామిగా నటిస్తున్నారు. జాతీయ అవార్డు విజేతలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక కలయిక, భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘జై హనుమాన్’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలబెట్టింది. ఆధునిక కథనాలను పురాణ అంశాలతో సమ్మిళితం చేస్తూ అద్భుతమైన, వినూత్నమైన కథలతో ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ తమ బ్లాక్‌బస్టర్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘కాంతార చాప్టర్ 1’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రిషబ్ శెట్టి ఈ చిత్రంలో నటించడం అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని విజయనగరంలోని హంపిలోని అంజనాద్రి బెట్టలో ఘనంగా ప్రారంభించారు. ఈ పవిత్ర స్థలం హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించబడుతుంది. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, అనిల్ థడాని ఫస్ట్ షాట్‌కు కెమెరా రోల్ చేశారు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.











