వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న ‘ఫంకీ’ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, మొదటి గీతం ‘ధీరే ధీరే’కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘రట్టాటటావ్’ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో ఈ గీతావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెలోడీ పాట ‘ధీరే ధీరే’తో శ్రోతల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఇప్పుడు ‘రట్టాటటావ్’ రూపంలో ఉత్సాహభరితమైన గీతాన్ని అందించారు. మాస్ బీట్స్ తో ఆయన స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఆ ఉత్సాహభరితమైన సంగీతానికి తగ్గట్టుగానే “రట్టాటటావ్ పిల్ల రట్టాటటావ్.. నీకు దండం ఎట్టుకుంట పిల్ల రట్టాటటావ్” అంటూ దేవ్ పవార్ అందించిన సాహిత్యం అందరికీ చేరువ అయ్యేలా ఎంతో అందంగా, సరదాగా ఉంది. గాయకుడు రామ్ మిరియాల తన గాత్రంతో ఈ పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.











