భారీ మెజార్టీ సాధించిన నవీన్
హైదరాబాద్, నవంబర్ 14: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కౌంటింగ్ ప్రారంభంలో హోరాహోరీ పోరు తప్పదని అనిపించిన.. రెండో రౌండ్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. బీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాలు మెుదలుపెట్టాయి.హైదరాబాద్ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉప ఎన్నికలో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
సాధించారు. నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74259 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17061 ఓట్లతో డిపాటిజ్ కోల్పోయారు. కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ.. రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో
కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనబరిచింది. కీలకమైన షేక్‌పేట్ ప్రాంతానికి సంబంధించిన తొలి ఈవీఎం కౌంటింగ్‌లో కూడా కాంగ్రెస్ ఆశించిన భారీ మెజార్టీ రాలేదు. దీంతో పోరు చివరి వరకు
నువ్వా-నేనా అన్నట్లు కొనసాగుతుందని.. బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తుందని భావించారు.అయితే.. రెండో రౌండ్ పూర్తి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి రౌండ్‌లో 47 ఓట్ల స్వల్ప ఆధిక్యం కనబరిచిన
నవీన్ యాదవ్.. ఆ తర్వాత ఏ రౌండ్‌లోనూ వెనుదిరిగి చూడలేదు. ప్రతి రౌండ్‌లోనూ దూసుకెళ్లిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉన్నా, ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. దీంతో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు మూడువేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తూ వెళ్లారు. ఆరో రౌండ్‌లో మెుత్తం మెజార్టీ 15 వేలు దాటగా.. ఎనిమిదో రౌండ్‌కు మెజార్టీ 20 వేల మార్క్ క్రాస్ అయింది. దీంతో నవీన్ గెలుపు ఖాయమైంది. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు.
రౌండ్ల వారీగా ఫలితాలు..
మొదటి రౌండ్: నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 8,911; మాగంటి సునీత (బీఆర్ఎస్) 8,864; దీపక్ రెడ్డి (బీజేపీ): 2167
రెండో రౌండ్: నవీన్ యాదవ్ 9,691; మాగంటి సునీత 8,609; దీపక్ రెడ్డి 3475
మూడో రౌండ్: నవీన్ యాదవ్ 11,082; మాగంటి సునీత 8,082; దీపక్ రెడ్డి: 3,475
నాలుగో రౌండ్: నవీన్ యాదవ్ 9,567; మాగంటి సునీత 6,020; దీపక్ రెడ్డి 1935
ఐదో రౌండ్: నవీన్ యాదవ్ 12,283; మాగంటి సునీత 8985; దీపక్ రెడ్డి: 1,273
ఆరో రౌండ్: నవీన్ యాదవ్ 9553; మాగంటి సునీత 6615; దీపక్ రెడ్డి: 1666
ఏడో రౌండ్: నవీన్ యాదవ్ 9939; మాగంటి సునీత 5939; దీపక్ రెడ్డి: 1688
ఎనిమిదో రౌండ్: నవీన్ యాదవ్ 9293; మాగంటి సునీత 7418; దీపక్ రెడ్డి: 2105
తొమ్మిదో రౌండ్: నవీన్ యాదవ్ 11793; మాగంటి సునీత 9544; దీపక్ రెడ్డి: 1688
పదో రౌండ్: నవీన్ యాదవ్ 7561; మాగంటి సునీత 6753; దీపక్ రెడ్డి: 713
తొమ్మిదో రౌండ్: కాంగ్రెస్ గెలుపు ఖాయం..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరైంది. తొమ్మిదో రౌండ్‌లో 2,117 ఓట్ల మెజార్టీ సాధించింది. మెుత్తంగా తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి.. 23, 162 ఓట్ల మెజార్టీ సాధించింది. మరో రౌండ్ మాత్రమే కౌంటింగ్ మిలిగి ఉండగా.. నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా, స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిదో రౌండ్: కాంగ్రెస్ పార్టీకి 20 వేలు దాటిన మెజార్టీ
ఎనిమిదో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1875 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో మెుత్తం మెజార్టీ 20 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం 21,495 ఓట్లతో నవీన్ లీడ్‌లో ఉండగా.. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది.
ఏడో రౌండ్: దూసుకెళ్తున్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నాడు. ఏడో రౌండ్‌లో భారీ మెజార్టీ సాధించారు. ఈ రౌండ్‌లో ఏకంగా 4 వేలకు పైగా మెజార్టీ సాధించారు. మెుత్తంగా ఏడు రౌండ్లు ముగిసే సరికి నవీన్ యాదవ్ 19 వేలకు పైగా మెజార్టీ సాధించారు.
ఓడిపోతామని మాకు ముందే తెలుసు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ విజయం వైపు దూసుకెళ్తుండగా.. బీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంది. ఇక బీజేపీ పార్టీ దరదాపుల్లోనూ లేకుండా పోయింది. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి డిపాజిట్ కూడా కష్టమనే స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఈ ఎన్నికల్లో గెలవమని ముందే తెలుసుననిఆయన వ్యాఖ్యానించారు. కేవలం తమ పార్టీ ప్రాతినిధ్యం వహించడానికే పోటీ చేసిందని, గెలుపు లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఓటమి ఖాయం కావటంతో అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంమైంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాలు పట్టే ఛాన్స్ ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా…బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మెుత్తం 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను 103 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.ఇక ఇటీవల జరిగిన పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపాయి. దీంతో రాజకీయ
వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా, తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో అనివార్యమైంది ఈ ఉపఎన్నిక.











