ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు… రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్రావు ప్రకటన విడుదల చేశారు.
‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా… భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు.











