మరో 2 ఎకరాలు కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తొలిసారిగా అసెంబ్లీకు పంపించిన పిఠాపురం నియోజకవర్గం అంటే ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లోనూ పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలుండగా ఆయన పిఠాపురంలో స్థానికునిగా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటికే పిఠాపురంలో 18 ఎకరాలు భూమిని కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్ తాజాగా మరో 2.63 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూములకు ఆనుకునే ఈ నెలాఖరు నాటికి మరో 2 ఎకరాలుకుపైగా భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిని బట్టి పిఠాపురం నియోజకవర్గంలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పిఠాపురంలో జనసేన పార్టీ కార్యాలయంతోపాటు, ఆయనకు ప్రత్యేక గెస్ట్‌హౌస్ నిర్మాణం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం హైవేను ఆనుకుని పవన్ తన కార్యకలపాలను నిర్వహించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 216 జాతీయ రహదారిని ఆనుకుని పిఠాపురం – గొల్లప్రోలు టోల్ ప్లాజాకు సమీపంలో ఈ భూమి ఉంది. గతంలో 18 ఎకరాలు ఒకే బిట్ కొనుగోలు చేసిన పవన్ తాజాగా మరో 2.63 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయడంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికను పిఠాపురం నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 13వ తేదీన ఆయన పిఠాపురంలో ఎల్‌పి.నెం 100, 105, 211లో 2.63 ఎకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకు ఆయన తరుపున సివిల్ సప్లై ఛైర్మన్ తోట సుధీర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 216 జాతీయ రహదారికి ఆనుకుని ఇలింద్రాడ రెవెన్యూ పరిధిలో తూర్పు, ఈశాన్య స్థలాన్నిఆయన కొనుగోలు చేయగా ఈ స్థలానికి ఆనుకుని ఉన్న 2.63 ఎకరాల భూమిని ఆయన సొంతం చేసుకున్నారు.
గొల్లప్రోలుకు చెందిన జలిగంపల కమల నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన భూమికి వెనుక వైపు ఉన్న మరో 2 ఎకరాలకుపైగా భూమితోపాటు ఈ ల్యాండ్‌ను ఆనుకుని ఉన్న మరోకరి భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆ ఇద్దరి రైతుల భూమి కూడా పవన్ కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు.
భారీ మొత్తంలోనే వెచ్చించి ఈ భూమిని పవన్ దక్కించుకుంటున్నారని చెబుతున్నారు.తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడంతోపాటు స్థానికేతరుడు, పిఠాపురంలో ఎమ్మెల్యే ఉండడంలేదన్న అపనిందను తొలగించుకోవాలని ఆయన ప్రయత్నాలు ఉన్నాయంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక అంతా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉంటుందంటున్నారు.
అందుకే పిఠాపురం-గోల్లప్రోలు టోల్ ప్లాజా మార్గంలో 216హైవేకు ఆనుకుని తూర్పుమార్గంలో ఉన్న ప్రస్తుత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోగా తాజాగా కొనుగోలు చేసిన భూమిలోనే జనసేన పార్టీ కార్యాలయంతోపాటు, గెస్ట్‌హౌస్ కూడా కడతారని అంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈపనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. పవన్ పిఠాపురం కేంద్రంగా పవన్ ఫ్యూచర్ ప్లాన్‌కు అడుగులు వేస్తున్నారని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కొనుగోలు చేసిన స్థలంలో నిర్మాణాలు ప్రారంభించడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు.











