- వేగంగా అనుమతులిస్తాం… అవసరమైన మేరకు భూములిస్తాం
- ఎర్త్ మినరల్స్ నుంచి ఎరో స్పేస్ వరకు ఏపీలో అపార అవకాశాలు
- ఒప్పందాలు చేసుకుందాం…
- భవిష్యత్ అవసరాలపై ప్రణాళికలు రూపొందిద్దాం
- బిజినెస్ ఎక్స్‌పోల నిర్వహణ కోసం విశాఖలో ఆంధ్రా మండపం
- అరకు అందాలు చూడండి… కాఫీ రుచిని ఆస్వాదించండి
- బీహార్ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ గెలిచింది… అభినందనలు
- రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం, నవంబర్ 14: రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రొత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రొత్సాహకాలకు సావరీన్ గ్యారెంటీ ఇస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి జరగనున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ వేదికగా సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”522 మంది విదేశీ ప్రతినిధులు, 72 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు.
2,500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌లో విశాఖ అత్యంత సుందరమైన నగరం. సుందరమైన బీచ్‌లు, కొండలు, ప్రకృతి వనరులు ఉన్న ప్రాంతం. అత్యంత సురక్షిత నగరంగా ఇటీవలే రేటింగ్ కూడా విశాఖకు వచ్చింది. భారత్‌లో పెట్టుబడులకు గేట్ వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించటంలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఏపీలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రియల్ టైమ్‌లో అనుమతులు ఇవ్వటంతో పాటు వేగంగా పరిశ్రమలు నిర్మించేలా చూస్తున్నాం. పది సూత్రాల ఆధారంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
డ్రోన్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు
“ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారు. ఏపీలో త్వరలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నాం. డ్రోన్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, స్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పని చేస్తున్నాం. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీలతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ధిక వ్యవస్థలను నిర్మించటంతో పాటు సంపద సృష్టించటంలో కలసి పని చేద్దాం. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తులు, పర్యాటకం ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను.
గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. డీప్ టెక్నాలజీ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఏరో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నాం. త్వరలోనే భారత్‌లో అది కూడా ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తాం. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశాలు. పోర్టులు, డ్రైపోర్టులు, అంతర్గత జలరవాణా, హెల్త్ కేర్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్రిటెక్, ఈవీ టెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.”అని సీఎం చెప్పారు.











