- రూ. 15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం!
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ
రాయచోటి, నవంబర్ 24: అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదం మోపింది. న ప్రత్యేక ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కలకడ సీఐ బి. లక్ష్మన్న, కె.వి. పల్లి ఎస్ఐ యం. చిన్న రెడ్డప్ప, కలకడ ఎస్ఐ బి. రామాంజనేయులు బృందం ఈ అరెస్టును నిర్వహించింది.
నిందితులను సోమవారం నాడు కె.వి. పల్లి మండలం, తిమ్మాపురం క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. కుంచెపు పురుషోత్తం, పూజారి శంకరయ్య, కుంచెపు మోహన్‌బాబు, బండి బాలాజీ లను అరెస్టు చేసారు. నిందితులలో ఒకరు కుంచెపు మోహన్‌బాబు, కలకడ మండలం, కె. దొడ్డిపల్లి లో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ నేరాలకు పాల్పడ్డాడని అయన వివరించారు.
వీరంతా సంబేపల్లి, కలకడ, కలికిరి, పీలేరు, గుర్రంకొండ, కె.వి. పల్లి పరిసర ప్రాంతాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నిందితులనుంచి ఆరు బంగారు చైన్లు, మొత్తం 140 గ్రాములు (సుమారు రూ. 15 లక్షల విలువ), నగదు: రూ. 40,150/-. 4 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు మరియు 15 చీరలు స్వాధీనం చేసుకున్నారు.











