ఆవేదన వ్యక్తం చేసిన పరికి చెరువు పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఉమా మహేష్
కుత్బుల్లాపూర్ నవంబర్1: కుత్బుల్లాపూర్ మండలంలోని జగత్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ, ఆల్విన్ కాలనీ పరిసరాల్లో ఉన్న పరికి చెరువుపై అక్రమ నిర్మాణాలు మళ్లీ చెలరేగాయి. గత ఫిబ్రవరిలో హైడ్రా అధికారులు అక్రమాలను గుర్తించి కూల్చినా, తిరిగి అదే చోట కొత్త నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని పరికి చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగదీర్గుట్టలో శనివారం సమావేశమైన కమిటీ సభ్యులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు సరిహద్దులు ఖరారు చేసి హద్దు బోర్డులు ఏర్పాటు చేయాలని, అక్రమ కబ్జాలు చేసి స్థలాలు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. “హైడ్రా ఇతర చెరువులను అభివృద్ధి చేసినట్లే పరికి చెరువును కూడా అభివృద్ధి చేయాలి. లేకపోతే చెరువు ఆనవాళ్లు కూడా ఉండవు” అని సభ్యులు తెలిపారు. ఈ అంశంపై స్పందన రాకపోతే మరోసారి హైడ్రాకు వినతిపత్రం సమర్పించి, ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.











