- ధర్మవరం లో మళ్ళీ కోరలు చాస్తున్న ’మైక్రో ఫైనాన్స్ ’ జలగలు
- పేద, మధ్యతరగతి మహిళలే టార్గెట్, వారిని గ్రూపులుగా చేసి రుణాలు
- కొత్త చెరువు, పెనుగొండ ప్రాంతాల్లో ఆఫీసులు – ధర్మవరంలో వడ్డీ వ్యాపారం
- గతంలో మైక్రో ఫైనాన్స్ లను తరిమి కొట్టిన అప్పటి ఎమ్మెల్యే ’కేతిరెడ్డి’
- మైక్రో ఫైనాన్స్ ల పడగ నీడలో మంత్రి నియోజక వర్గం
- ఇప్పటికే ధర్మవరంలో అప్పుల బాధతో ఆత్మ హత్యలు
ధర్మవరం పట్టణంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ వ్యాపారులతో గతంలోనూ, ప్రస్తుతం కూడా పేద, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆర్థిక పరిస్థితుల, అవసరాల రీత్యా అప్పులకు లోనై వడ్డీలు కట్టలేక, అప్పు తీర్చలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడడం ధర్మవరం ప్రజలకు విదితమే..
గత రెండేళ్ల నుండీ ధర్మవరంలో మైక్రో ఫైనాన్స్ ల పడగ :
ప్రభుత్వం మారిన వెంటనే చాప కింద నీరులాగా ధర్మవరం పట్టణంలో మైక్రో ఫైనాన్స్ లు మళ్ళీ పడగ విప్పారు. పట్టణంలోని శివారు కాలనీలు చెన్నకేశవ పురం, ఎల్. 1, ఎల్. 2, ఎల్. 3, ఎల్. 4, కేతిరెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలనీ, అదే విధంగా పట్టణంలో కూడా ఈ మైక్రో ఫైనాన్స్ మళ్ళీ కోరలు చాచి పేద, మధ్య తరగతి ప్రజల్ని కాటు వేస్తోంది. ప్రజలు విముఖత చూపినా సరే.. ఈ మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు వాళ్ళ కమీషన్ కోసం ప్రజల ఇళ్ల వద్దకు పదే పదే వెళ్లి తక్కువ వడ్డీ అంటూ ఆశ చూపుతూ, వారి ఆర్థిక అవసరాల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఉచ్చులో దింపుతున్నారు.
ఐదు, పదిమంది మహిళలను ఒక గ్రూపుగా చేసి మొదటగా ఒక్కరికి రూ.5 వేల తో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరికీ రూ. 1 లక్ష వరకూ ఫైనాన్స్ ఇస్తారు. ఇందులో వారం కంతులు, నెల కంతుల ప్రకారం వసూళ్లు చేస్తారు. అంతేకాకుండా అప్పు ఇవ్వడానికి ముందే ఇన్స్యూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరిట అప్పును బట్టి రూ. 3 వేల నుండీ రూ. 6 వేల వరకూ ఒక్కొక్కరితో వసూలు చేస్తారు. వారు నిర్ణయించిన రోజున మొత్తం పదిమందీ ఖచ్చితంగా కంతులు కట్టాలి, లేదంటే పెనాల్టీ పేరుతో అదనపు వసూలు. గ్రూపులో ఒక్క మహిళ కట్టక పోయినా డబ్బు చెల్లించే వరకూ పదిమంది మహిళలు అక్కడే కూర్చోవాల్సిందే..
ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30 వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు.
రెక్కాడితే గాని డొక్కాడని పేద, మధ్య తరగతి ప్రజలు తమ అవసరాలు, ఆర్థిక స్థితిగతుల వల్ల ఈ మైక్రో ఫైనాన్స్ ల బారినపడి సమయానికి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పదిమంది ముందూ అవమానాలు ఎదుర్కొంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. మరికొంత మంది ఈ బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మైక్రో ఫైనాన్స్ లకు చెక్ పెట్టిన అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి :
గత వైసీపీ.ప్రభుత్వ హయాంలో స్పందన, కీర్తన, ఫిన్కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, లాంటి రకరకాల మైక్రో ఫైనాన్స్ లు ధర్మవరం పట్టణంలో పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమయంలో మైక్రో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులను ధర్మవరం నుండీ తరిమి కొట్టిన ఘనత నిజంగా కేతిరెడ్డి కే దక్కుతుంది. పేద ప్రజలు మైక్రో ఫైనాన్స్ ల ఉచ్చులో పడి వడ్డీలు కట్టలేక, బాకీలు తీర్చలేక సతమవుతున్న దుస్థితి తన దృష్టికి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది.
పోలీసు అధికారులతో మాట్లాడి ధర్మవరం పట్టణంలో ఎలాంటి మైక్రో ఫైనాన్స్ లు ఉండరాదని తరిమికొట్టారు. పేదలను ఇబ్బంది పెడుతున్న మైక్రో ఫైనాన్స్ వాళ్ళని తాను అధికారంలో ఉన్నంతవరకూ పట్టణంలో అడుగుపెట్టనివ్వలేదు. ఈ విషయం పట్టణ ప్రజలందరికీ తెలిసిందే.. అప్పటి సీఐ కరుణాకర్ మైక్రో ఫైనాన్స్ అక్రమ వడ్డీ వసూళ్లు పట్టణంలో లేకుండా గట్టి చర్యలు చర్యలు చేపట్టారు. దీంతో మైక్రో ఫైనాన్స్ ల బాధితులైన చాలామంది పేద ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మైక్రో ఫైనాన్స్ లు ఒకవైపు, అక్రమ వడ్డీ వ్యాపారులు మరో వైపు..
పట్టణంలో ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళే కాకుండా వారం వడ్డీలు, నెలకు నూటికి ఐదు, పదీ, వసూలు చేసే అక్రమ వడ్డీ వ్యాపారుల బారినపడ్డ ప్రజలు కూడా ఉన్నారు. బైటకు చెప్పుకోలేక, వడ్డీలు కట్టలేక మానసికంగా కృంగిపోతున్న కుటుంబాలెన్నో ఉన్నాయంటే నమ్మరు. కానీ ఇది వాస్తవం. ఎవరు నమ్మినా.. నమ్మక పోయినా ఇది నిజం!!
మంత్రి సత్య కుమార్ యాదవ్ గట్టి చర్యలు తీసుకోవాలి
ఈ మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీలు, ఫైనాన్స్ ప్యాపారం చేసే వారిపై తూ.. తూ.. మంత్రంగా కాకుండా, పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా నిజాయితీగా, పారదర్శకంగా విచారణ చేసి, పట్టణంలో ఫైనాన్స్ పేరిట వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేదా? ఈ వ్యాపారుల్లో ఎంతమంది తమ ఫైనాన్స్ ను రిజిస్టర్ చేయించుకున్నారు? ఆడిట్ రిపోర్టులు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారా? లేదా? అని విచారణ జరిపించి, అక్రమ వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటీవల అప్పుల బాధ తట్టుకోలేక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆత్మహత్య చేసుకొన్న కారు డ్రైవర్ లాగా ఎవ్వరూ కూడా అక్రమ వడ్డీల బారిన పడి ఆత్మహత్య చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, వీలైతే పట్టణ శివారు కాలనీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి, మైక్రో ఫైనాన్స్ లను తిరిగి ధర్మవరం నుండీ వెళ్లగొట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఈ మైక్రో ఫైనాన్స్ ముసుగులో ప్రజల రక్తంతో వ్యాపారం చేస్తున్న అక్రమ వడ్డీదారుల నుండీ పేద ప్రజలను రక్షించిన అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి లాగా ప్రస్తుత ఎమ్మెల్యే, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మైక్రో ఫైనాన్స్ సంస్థల ను ధర్మవరం నుండీ తరిమికొడతారా? లేదా ? అన్నది వేచిచూడాల్సిందే..!!











