టూ వీలర్ మీద వెనక కూర్చున్నవారు హెల్మట్ ధరించకపోతే జరిమానా విధించడం చట్టబద్ధమేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కె. మల్లేశ్ గౌడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో, పిలియన్ రైడర్లపై జరిమానా విధించడం మరియు ట్రాఫిక్ ఈ-చలాన్‌లపై ₹35 యూజర్ చార్జీ వసూలు చేయడాన్ని సవాలు చేశారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాది (హోం) జి. అనికేత్ రెడ్డి.. ఈ జరిమానాలు మరియు యూజర్ ఛార్జీలు చట్టబద్ధంగా వసూలు అవుతున్నాయని కోర్టుకు వివరించారు.
ఈ వాదనను కోర్టు ఆమోదించింది. జీవో నెంబర్ 307 ప్రకారం.. 2007 డిసెంబర్ 26 నుంచి ఈ జరిమానాను వసూలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ టి. వినోద్ కుమార్ తీర్పునిచ్చారు. ఆ తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాబట్టి, మోటార్ వెహికిల్ చట్టం, 1988లోని సెక్షన్లు 128 మరియు 129 ప్రకారం, డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చున్న ప్రయాణికుడు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి. లేకపోతే, డ్రైవర్‌లానే వారిపైనా జరిమానా విధిస్తారు.











