షుగర్ వ్యాధి వచ్చి.. చేతికో కాలికో దెబ్బ తగిలి ఇన్ ఫెక్షన్ గా మారితే ఆ పార్ట్ ను తొలిగించుకోవాల్సిందే’’ అన్నట్టుగానే కేసీఆర్ కుటుంబం రాజకీయ టీం నుంచి కవితను బయటకు పంపించారు. ఎంత చేసినా.. ఎన్ని మాటలు తిట్టినా కన్న కూతురే. అందుకే ఇప్పటిదాకా ఏం మాట్లాడినా, ఎవరిని తిట్టినా భరించుకుంటూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఇంటి గుట్టును రోడ్డున పడేయడంతో వేటేయక తప్పలేదు. చుట్టూరా దెయ్యాలు ఉన్నాయన్నా భరించాడు. తన వర్గాన్ని తిట్టినా.. లిల్లీపుట్, ఇంకా ఏవేవో మాట్లాడినా చూసీచూడనట్టు ఓపిక పట్టాడు. కానీ, చివరకు.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తమ మీదకే తుపాకీ తిప్పడంతో భరించలేకపోయాడు.
అసలే కాళేశ్వరం ఇష్యూ.. రాష్ట్రం నుంచి కేంద్రం చేతికి వెళ్తోంది. ఇలాంటి సమయంలో తన కూతురే.. తమను ఇరికించే ప్రయత్నాలు చేసింది. ‘‘ అవినీతి జరిగింది.. చేసింది మా వాళ్లే ’’ అంటూ నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన మాటలను బహిరంగంగా చర్చ పెట్టింది. ఇలాంటి సమయంలో కవితను కట్టడి చేయకుంటే కష్టమే. అక్కడ అల్లుడా.. కొడుకా.. కూతురా.. అని చూస్తే కూతురుతోనే నష్టం వెనకే వస్తుందని గుర్తించాడు. వ్యూహాలు, రాజకీయ కోణాలు ఎలా ఉన్నా కవితను పార్టీ నుంచి పంపించాడు.
కేటీఆర్ ఒత్తిడి..?
ఎంత గాదన్నా.. కన్న కూతురు. కానీ, సొంత శిబిరంలోనే విపక్షంగా మారింది. చెప్పేవి నిజాలా.. కాదా..? నిజాలే అయినప్పటికీ కన్న కూతురును బయటకు పంపలేని పరిస్థితి. కానీ, పరిస్థితి విషమించింది. చేయి దాటింది. ఒత్తిడి పెరుగుతోంది. తప్పలేని పరిస్థితులు కల్పించడంతో.. ఎట్టకేలకు కవితను పార్టీ నుంచి బయటకు పంపేశాడు కేసీఆర్. దీనికి వెనుక కేటీఆర్ ఒత్తిడి మామూలుగా లేదని ఇటు జాగృతి నేతల వాదన. నిజానికి, కవిత ఫ్లెక్సీలు తగలేయాలని, నిరసనలు తెలుపాలని మంగళవారం ఉదయమే పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు మాత్రం లైన్ తప్పకుండా కవిత అని ఏకవచనాన్ని కూడా సంబోధించేంత ధైర్యం చేయకుండా గులాబీ నిరసనకారులు కవితక్క… డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కానీ. హరీశ్, సంతోష్‌రావుల పేర్లను బహిరంగంగా తెరపైకి తీసుకురావడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లుగా కవిత స్పష్టత ఇచ్చినట్లుగా మాట్లాడటంతో కేటీఆర్ కు మరింత అస్త్రం దొరికింది. దీన్ని మంచి సమయంగా తీసుకున్న కేటీఆర్.. తండ్రి కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాడు. ఎలాగైనా కవితను పార్టీ నుంచి బయటకు పంపాలనే సంకల్పం నెరవేరింది. ఇటు కేటీఆర్ ఒత్తిడి.. అటు కవిత వ్యాఖ్యాలు.. మొత్తంగా కవితను బయటకు పంపడం కేసీఆర్‌కూ తప్పలేదు.
లైన్ దాటిన కవిత
గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటడంతో కవితపై వేటు వేశారు. ‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.’ బీఆర్ఎస్ విడుదల చేసిన లేఖ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని అడిగారు. అందుకే రెండో టర్మ్‌లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకుంటున్నాయన్నారు. ‘నాపై కుట్రలు చేసిన సహించాను. కానీ కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నాను. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడు. అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. నేను ఎవరు ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత?’ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెుత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణంగా కవిత చూపించారు.
ఇప్పటిదాకా కవిత ఎన్ని మాటలు తిట్టినా.. ఎన్ని ఆరోపణలు చేసినా సైలెంట్ గా చూస్తూ ఉన్న కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు ఈ కాంట్రావర్సీ కామెంట్స్ ఒక్కసారిగా నిప్పు రాజేశాయి. ఎందుకంటే కాళేశ్వరం వివాదం మొత్తంలో తన తండ్రిని, ఇద్దరు బావలను కవిత దోషిగా తేల్చేసింది. అంటే ఏం విచారణ చేయకుండానే అందులో అక్రమాలను కవిత ఒప్పేసుకుంది. ఈ పరిణామం తర్వాత కేటీఆర్ హుటాహుటినా ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. హరీశ్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలను పిలిపించుకున్నారు. రెండు రోజులు చర్చలు చేశారు. ఈ చర్చల అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కవిత రెడ్ బుక్.. ఎవరెవరి పేర్లు
మొత్తంగా కవిత చెప్పినట్లే.. దయ్యాల గడీ నుంచి ఆమెను బయటకు పంపించారు. మొన్నటి దాకా చెప్పీ చెప్పకుండా.. మాట్లాడీ.. మాట్లాడకుండా ఆచి తూచి మాట్లాడిన కవిత.. ఇప్పుడిప్పుడే ఒక్కో పేరును రిలీజ్ చేస్తున్నారు. హరీశ్ రావు, సంతోష్ పేర్లను బయటపడేసింది. అంతేకాదు.. కవిత రెడ్‌బుక్‌లో చాలా మంది బీఆర్ఎస్ నేతల పేర్లున్నాయి. పార్టీలో ఉంటూ ఒక్కొక్కరి పేరును విడుదల చేసిన కవిత.. ఇప్పుడు ఇంకా ఎవరి జాతకాలు బయట పెడుతుందనేది కూడా పార్టీ నేతల్లో ఉన్న భయమే. మాజీ ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని మాజీ మంత్రులు.. ఎవరినీ వదలకుండా పార్టీని డ్యామేజీ చేసేందుకు కవిత సిద్ధమే అని చెబుతున్నారు.
అన్న దాకా రాకుండానే..?
కేసీఆర్ అనే దేవుడి చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత.. నిన్నటి వరకు వారి పేర్లు తీయలేదు. కాళేశ్వరం స్కాంలో మాత్రం ఏకంగా పార్టీ మూల స్తంభాలపైనే కొట్టింది. హరీశ్, సంతోష్‌లిద్దరిపైనే టార్గెట్ చేయడమే ఇక్కడ కవిత చేసిన అతి పెద్ద తప్పుగా కేసీఆర్ భావించారు. కానీ అందరికంటే ముందు.. అన్ని దయ్యాలకన్నా పెద్ద దయ్యం.. ఆది దయ్యం… కేటీఆర్ అనేదే కవిత వెనక ప్రధాన ఉద్దేశ్యం. అది అంతా తెలిసిన విషయమే. ఆమె నోటి వెంట… ఆ పేరు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూశారు. కవిత మాత్రం అన్న పేరును ప్రస్తావించే విషయంలో ఇప్పటి వరకు ఆచితూచి మాట్లాడింది. కాళేశ్వరం కేసును సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే.. బంద్‌కు పిలుపివ్వొద్దా..? అని అన్నను పరోక్షంగా ప్రశ్నించింది. కానీ, ఒక్కొక్కరిగా అంటూ హరీశ్ దాకా వచ్చింది. అంటే ఇక నెక్ట్స్ కేటీఆర్ దాకా రావడం ఖాయమైనట్టే. అందుకే.. అక్కడి దాకా రాకముందే కవితను కేసీఆర్ బయటకు పంపించారు.
కుటుంబ ఆస్తి రాజకీయాలేనా..?
మొన్న ఏపీలో షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో కవిత. మొత్తంగా కుటుంబ రాజకీయాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మొదట్లో మాదే కుటుంబం.. రాజకీయ కుటుంబమే మాది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. చూపించారు కూడా. తీరా అదే కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటూ వచ్చారు. వీటి వెనక ఆస్తుల పంచాయతీ అనేది ఏపీలో బయట పడింది. కానీ, కేసీఆర్ దగ్గర ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ అధికారంలో లేదు. సో.. అంత రాజకీయ పెత్తనం కోసం కాదనేది తేలిపోయింది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ వారసత్వ రాజకీయం నుంచి కవితను బయట పడేశారు. ఈ వ్యవహారంలో బుధవారం కవిత మీడియా ముందుకు రానున్నారు. ఇప్పుడు పార్టీ లైన్ లేదు. బీఆర్ఎస్ కాదు.. టార్గెట్ ఎవరి మీద నుంచి ఎవరి మీదకు కవిత తూటాలు వదులుతుందో చూడాల్సిందే మరి.











